Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు పాతర వేయబడుతున్నాయని విమర్శించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించినా ఇంకా బాధలను అనుభవిస్తూనే ఉన్నారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇండ్లు లేని ప్రజలు లక్షలాది మంది ఉన్నారని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వాలు స్వలాభాలు, స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను నిలబెట్టుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్, ప్రజాపక్షం సంపాదకులు కె శ్రీనివాస్‌రెడ్డితోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.