Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-వట్ పల్లి
నవ మాసాలు మోసి.. కని, పెంచి, పెద్ద చేసిన కన్నతల్లిని ఆమె బంగారు నగల కోసం కొడుకే గొంతు నులిపి హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతుల బొగుడ గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55) లక్ష్మయ్య భార్యాభర్తలు.వీరికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయమై వారి కుమారుడు మురళీ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను బెదిరించి ఆస్తిని తన పేర బలవంతంగా రాయించుకున్నాడు.అలాగే తల్లి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఎలాగైనా తీసుకోవాలని పన్నాగం పన్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో తల్లి ఒక్కతే ఉండటంతో గొంతునులిమి హతమార్చాడు. అనంతరం ఏమి తెలియనట్టు చుట్టుపక్కల వారికి అనారోగ్యంతో తల్లి మృతి చెందిందని నమ్మించే యత్నం చేశాడు. కానీ వారు మురళీ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులకు సమాచారమందించారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి అల్లుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్టు జోగిపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ దశరత్ తెలిపారు.