Authorization
Tue April 08, 2025 12:44:50 pm
- టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కులం, మతం, భాషల పేరిట బీజేపీ.. దేశ ప్రజల్లో విభజన తీసుకొస్తున్నదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఆ పార్టీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జాతీయవాదం అనే దానికి బీజేపీ ఇప్పుడు కొత్త నిర్వచనం తీసుకొస్తున్నదని తెలిపారు. లౌకికవాదం, సమానత్వం, సమసమాజ స్థాపన అనేవి మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలని తెలిపారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
నాపై ఆరోపణలు అవాస్తవం... : మంత్రి శ్రీనివాసగౌడ్
తాను ఎన్నికల అఫిడవిట్‌ను టాంపరింగ్ చేసినట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేయటం సరికాదని మంత్రి వి.శ్రీనివాసగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద ద్వేషంతోనే ఆయా సంస్థలు ఇలాంటి ప్రచారానికి తెగబడ్డాయని తెలిపారు. వార్తలు రాసేముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాజకీయంగా ఎదుగుతున్న తనపై కక్షతోనే ఇలాంటి వార్తలను రాస్తున్నారని విమర్శించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదని స్పష్టం చేశారు.
ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి... :టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
రాష్ట్ర రైతాంగాన్ని నిందించినందుకు ఎంపీ అరవింద్ వారికి క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెప్పిస్తానంటూ హామీనిచ్చిన అరవింంద్ మాట తప్పారని విమర్శించారు. అందువల్లే అక్కడి రైతులు ఆయనపై తిరగబడ్డారని చెప్పారు. రైతులకు హామీలిచ్చి విస్మరిస్తే... రైతులు నిలదీయరా..? అని ప్రశ్నించారు.