Authorization
Tue April 08, 2025 03:07:20 pm
- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ
- ఘనంగా గణతంత్ర వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైకోర్టులో త్వరలో కొత్త జడ్జీల నియామకాన్ని చేపడతామని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ వెల్లడించారు. మహిళలు జడ్జీలుగా రాణిస్తున్నారని, పెద్ద సంఖ్యలో నియమితులవుతున్నారని చెప్పారు. హైకోర్టులో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు మహిళలు జడ్జీలుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టులో బుధవారం రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. చైనా సైనికుల చేతిలో మరణించిన కల్నల్ సంతోష్ కుమార్ తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌ను ఆయన ఈ సందర్భంగా సన్మానించారు. వారికి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, జిల్లాల్లో 434 మంది జడ్జీల్లో 221 మంది మహిళలే ఉన్నారని చెప్పారు. ఇది 52 శాతమని చెప్పారు. 231 మంది జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల్లో 4 ఖాళీలు ఉన్నాయని, 2021లో 66 మందిని నియమిస్తే అందులో కూడా సగానికిపైగా మహిళలు ఉన్నారని చెప్పారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జిల్లాల కోర్టులను ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కోవిడ్ కష్టకాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, గత ఏడాది 57 వేల కేసులు హైకోర్టులో నమోదైతే 40 వేల కేసులను పరిష్కరించామని తెలిపారు. భౌతిక కోర్టులు కూడా ప్రారంభమయ్యాక మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కరోనా వస్తే లాక్డౌన్ విధించి ఆన్లైన్లో కేసుల్ని విచారిస్తున్నామని వివరించారు. ఈ ఏడాది కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రచించిన వారిలో అంబేద్కర్ న్యాయ రంగంలో ఆరితేరిన వ్యక్తి కాబట్టే ఆయన ఆ ప్రక్రియకు నాయకత్వం వహించారని తెలిపారు.