Authorization
Tue April 08, 2025 08:30:18 am
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో రూ.2 కోట్ల విలువైన ఎండు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని నందికంది వద్ద బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు పక్కగా సమాచారం అందడంతో నందికంది వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న లారీని ఆపీ తనిఖీ చేయగా.. ఒక్కోటి రెండు కిలోలు కట్టిన 500 ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులు షేక్ సలీం, అజీజ్ కాస్ సహా లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఆజాద్ అనే వ్యక్తి.. నిందితులతో రూ.2 లక్షలకు బేరం మాట్లాడుకున్నారనీ, అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చినట్టు గుర్తించినట్టు డీఎస్పీ బాలాజీ తెలిపారు. అలాగే, జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం పీచేర్వాగడిలో రూ.21 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం మన్యం నుంచి జహీరాబాద్ మీదుగా ముంబయికి వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ రమణ కుమార్ అభినందించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.