Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల(డ్రగ్స్) వాడకమనే మాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వాటి వాడకాన్ని నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టేలా ఈనెల 28న ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్' జరుగనున్నది. అందులో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీలు, ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ, ఇతర అధికారులు పాల్గొంటారు. బుధవారం ప్రగతి భవన్ లో సీఎస్, డీజీపీ, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో ఇదే అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 (వెయ్యి) మందితో కూడిన 'నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్'' (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక విధులను నిర్వర్తించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు.