Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిలభారత సర్వీసుకు (ఏఐఎస్) చెందిన ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులను తన ఆధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగంలోని ఫెడరల్ స్పూర్తికి విరుద్దమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్తా భారత్ చేస్తామంటూ బీజేపీ అంటున్నదనీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీని ప్రజలకు దూరం చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. దేశంలో మోడీ నేతృత్వంలో ఒక నియంత పాలన సాగుతున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కేసీఆర్ ఒక సామంత రాజులాగా వ్యవహరిస్తూ...ప్రజల హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. సిరిసిల్ల జిల్లా నెరేళ్ల ప్రాంతంలో ఇసుక మాఫియాను వ్యతిరేకించిన యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మిరప రైతులపై కేసులు పెట్టారనీ, భద్రాచలంలో ఆదివాసీ మహిళను చెట్లకు కట్టేసి కొట్టారని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదంటూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల హక్కులు రక్షించబడుతాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ సభ్యత్వం 17 లక్షలు దాటిందనీ, తమ పార్టీ నిర్ధేశించుకున్న 30 లక్షల సభ్యత్వ మైలురాయిదాటే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.