Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వంపై వ్యకాస, రైతు, సీఐటీయూ ఆగ్రహం
- 31న విద్రోహ దినాన్ని పాటించాలని పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వక హామీలిచ్చిందనీ, వాటిని అమలు చేయకుండా మరిచిపోయిందని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి విధానాలకు నిరసనంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపుమేరకు 31న విద్రోహ దినాన్ని పాటించాలని కోరాయి. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఆయా జిల్లాలు, మండల కేంద్రాల్లో సభలు నిర్వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖలోని ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యమ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చిన కేంద్రం ఆ దిశ ప్రయత్నాల చేయడంలేదన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హర్యానా ప్రభుత్వం అందులోకి కొన్నింటిని అమల్జేసిందనీ, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికీ కేంద్రం లేఖ పంపలేదని చెప్పారు. అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కనీస మద్దతు ధరల అంశానికి సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటన విషయంలో కేంద్ర సర్కారు, యూపీ ప్రభుత్వం నాన్చుడు దోరణి అవలంభిస్తున్నాయని విమర్శించారు. రైతుల జీవితాల పట్ల బీజేపీకి గౌవరం లేదన్నారు. ఆ ఘటనపై సిట్ ఇచ్చిన నివేదికలో కుట్ర దాగి ఉందంటూ ఒప్పుకున్నప్పటికీ దానికి ప్రధాన సూత్రధారి అజరుమిశ్రా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను ఉపంసహరించుకోవాలనీ, కనీస మద్దతుధరల చట్టం కోసం, ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.