Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సమస్య పరిష్కరించాలని ఒకరు..
- ఆస్తుల పంపకం సమస్యతో మరొకతను..
నవ తెలంగాణ - భువనగిరి రూరల్/ నల్లగొండ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ, యాదాద్రి కలెక్టరేట్లలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూసమస్యలను పరిష్కరించాలని ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో రాగా, ఆస్తుల పంపకం విషయంలో అన్యాయం చేస్తున్నారని మరో యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. వివరాలిలా ఉన్నాయి..
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కారు వద్దకు వెళ్తుండగా.. ఆలేరు మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన చంద్రమహేశ్ పెట్రోల్ బాటిల్‌తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వ్యవసాయ భూమికి సంబంధించి ఇప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు అధికారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్తుల విషయంలో న్యాయం జరగలేదని..
ఆస్తుల పంపకం విషయంలో తనకు న్యాయం జరగడం లేదని యువకుడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సెల్‌టవర్ ఎక్కాడు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన కత్తుల శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తన తండ్రి ఎల్లయ్య పేరు మీద ఉన్న 121 గజాల స్థలాన్ని తనకు తెలియకుండా అన్నదమ్ముళ్లు, అమ్మానాన్న కలిసి చెల్లెలు సంధ్యారాణి పేరు మీద పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కానన్నాడు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ వి.బాలగోపాల్ సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ కిందికి దిగాడు. అనంతరం బాధితుడిని పోలీసులు స్టేషన్ తీసుకుపోయి విచారించారు.