Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగపరమైన రాష్ట్రాల అధికారాలను కొనసాగించాలి :
తెలంగాణ పౌరస్పందన వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆలిండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్-1954 సవరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సవరణ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సహకార ఫెడరలిజం స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగపరమైన రాష్ట్రాల అధికారాలను కొనసాగించాలని కోరింది. ఈ మేరకు వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సవరణ వల్ల రాష్ట్రాలకున్న రాజ్యాంగపరమైన హక్కులపై కేంద్రం పెత్తనాన్ని పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల సర్వీస్ రూల్స్‌కు ప్రతిపాదించిన సవరణలు సూటిగా రాష్ట్రాల రోజువారీ పరిపాలనాంశాల్లో జోక్యానికి అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అనుకూలంగా పనిచేసే వారిని కేంద్ర సర్వీసుల్లో ప్రతిష్టించడానికి ఉపయోగపడుతుందని వివరించారు. కేంద్రం విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల్లో అంకితభావంతో పనిచేసే అధికారులను వారి ఇష్టానుసారంగా కేంద్రానికి డిప్యూట్ చేసుకునే ప్రమాదముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో అధికారుల్లో భయం, సంకోచం కలిగే పరిస్థితి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కుంటుపరిచే అవకాశముందని వివరించారు. రాష్ట్రాలకున్న రాజ్యాంగపరమైన అధికారాలు మరింత కుదించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జాబితాలోని విద్య, వైద్యరంగాన్ని దాదాపుగా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుందని పేర్కొన్నారు. జాతీయ (నూతన) విద్యావిధాన ప్రకటన అందులో భాగమేనని వివరించారు. రాష్ట్ర జాబితాలోని సహకార రంగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, హోంమంత్రి అమిత్‌షాకు ఆ బాధ్యతలు కట్టబెట్టిందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరణల పేరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మూడు చట్టాలను చేసిందనీ, దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనలను గతేడాది కాలంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. బీహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ (నితీష్‌కుమార్) ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.