Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికులకు జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలనీ, వేతన సవరణ సహా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. దీనికోసం కార్మికులు ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కే హన్మంతు, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి, కన్వీనర్ పీ కమాల్ రెడ్డి, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, బి.యాదగిరి, కోశాదికారి డి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను ప్రకటించారు. సమ్మెకు ముందు యూనియన్లతో యాజమాన్యానికి ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఈనెల 31న మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి మూడవ తేదీ ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ ఇస్తారు. ఆర్టీసీలో యూనియన్లను కొనసాగించాలని కోరుతూ ఫిబ్రవరి ఐదు నుంచి 14వ తేదీ వరకు కార్మికులతో సంతకాల సేకరణ జరపాలనీ, ఫిబ్రవరి 15వ తేదీ ఇదే డిమాండ్ పరిష్కారం కోసం ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా జేఏసీలోని అన్ని కార్మిక సంఘాలు క్షేత్రస్థాయిలో కార్మికులను దీనికోసం సమాయత్తం చేయాలని చెప్పారు. యూనియన్లకు అతీతంగా కార్మికులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.