Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ చార్జీల భారం
- ఆరునెలల్లో రెండోమారు పెరిగిన భూ విలువలు
- 25- 50% ఆస్తుల విలువల పెంపుదల.. 1 నుంచి అమలు
- ఏడాది ఆదాయాన్ని ఆర్నెళ్లలో కూడబెట్టిన ప్రభుత్వం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన విలువల మేరకు అదనపు రిజిస్ట్రేషన్ చార్జీల భారం పడనుంది. తద్వారా సామాన్యులు భూ క్రయాలకు దూరం కానున్నారు. సాధారణ ప్రజలు ఎకరం భూమి కూడా కొనలేని స్థాయికి మార్కెట్ విలువ పెరిగింది. పట్టణాల్లోనైతే జీవితాంతం కష్టపడినా వంద గజాలు కూడా కొనుక్కోలేని దుస్థితి వచ్చేసింది. అయినా ఇంకా వాస్తవ మార్కెట్ విలువకు చాలా దూరంలో ఉన్నా మని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్‌శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువకు పొంతనలేదనే కారణంతో ఈవాల్యూస్ను సవరిస్తున్నట్టు అధికారులు చెబుతు న్నారు. ఇక ఏటా మార్కెట్ విలువలు పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. డిమాండ్ బాగా ఉండే ప్రాంతాల్లోనైతే ఎప్పుడైనా పెంచే అధికారాన్ని స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖకు కట్టబెడు తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్నెళ్ల కిందట పెంచిన కొత్త మార్కెట్ విలువలు, రిజిస్ట్రే షన్ చార్జీల పెంపుతో 2021 -22 ఆర్థిక సంవత్సర అంచ నాలను రూ.12,500 కోట్లకు పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తే ఆదాయం అంచనాలను మించుతుందని ఆర్థికశాఖ లెక్కకడుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా వచ్చే రాబడి ఆర్నెళ్లలోనే...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా వచ్చే రాబడి జులైలో మార్కెట్ విలువల సవరింపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదల తర్వాత ఆర్నెళ్లలోనే సమకూరడం గమనార్హం. 11 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఏటా రూ.150 కోట్ల ఆదాయం వచ్చేది. అటువంటిది రియల్ఎస్టేట్ విలువలు, చార్జీల పెంపు తర్వాత ఆర్నెళ్లలోనే రూ.135.52 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 25 నుంచి 50 శాతం మార్కెట్ విలువల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం లభించేలా ఉంది. ఈ మేరకు ప్రజలు ఏటా రూ.150 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ ఆర్నెళ్లలో లభించిన రూ.135.52 కోట్లలోనూ ఖమ్మం రిజిస్ట్రార్ ఆఫీస్, ఖమ్మం రూరల్ కార్యాల యాల ద్వారానే రూ.75 కోట్లు, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.26 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూములు, ప్లాట్లకు అత్యధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా భవిష్యత్‌లో ఇక్కడ ఇబ్బడిము బ్బడిగా పెంపుదల ఉండవచ్చని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఆర్నెళ్లలోనే మరోసారి పెంపు...
ఆర్నెళ్ల కిందట జులైలో 30 నుంచి 50శాతం వరకే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో వంద శాతానికి పైగా పెంచింది. ఎకరం రూ.లక్షలోపు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువను 300 శాతం కూడా పెంచినట్టు రికార్డులు చెబుతు న్నాయి. ఈసారి కూడా అలాగే పెంపుదల ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే అధికారులు 25నుంచి 50శాతం వరకు పెంపుదల ఉంటుం దని చెబుతున్నారు. వ్యవసాయ భూములు 50 శాతం, సాధారణ ప్లాట్లు 35 శాతం, అపార్టుమెంట్ ఫ్లాట్స్ 25శాతం పెంపుదల ఉందంటున్నారు. ఈ మేరకు గతంలో ఎకరం రూ.3లక్షలున్న భూమి విలువ రూ.4.50 లక్షలకు , గజం రూ.10వేలున్న ప్లాట్ల విలువ రూ.13,500, ఎస్ఎఫ్టీ రూ.1600 ఉన్న అపార్టుమెంట్ ఫాట్ల విలువ ఇప్పుడు రూ. 2,000కు చేరనుంది. ఈమేరకు రిజిస్ట్రేషన్ చార్జీల అదనపుభారం కొనుగోలుదారులపై పడనుంది.
సామాన్యులు కొనలేరు..
ఇప్పటికే కొనే పరిస్థితి లేక రియల్ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అడ్డగోలుగా పెంచుతున్న రేట్లతో సామాన్యులు వంద గజాలు కూడా కొనుక్కొని ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. రాబడి కోసం సర్కారు చేస్తున్న ఈ ప్రయత్నం సామాన్యులను భూమికి దూరం చేస్తోంది. స్థిరాస్తి వ్యాపారులకు పెనుభారంగా మారింది. ధరణి తీసుకొచ్చి ప్రజలు, రియల్ వ్యాపారులను అవస్థలకు గురిచేశారు. ఇప్పుడీ పెంపుదలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. ప్రభుత్వం పునరాలోచించి పెంపుదలను వెనక్కు తీసుకోవాలి.
- అన్నం వీరప్రసాదరావు, తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు
పెంపుదలపై ఉద్యమిస్తాం..
వ్యవసాయ భూముల విలువను ఏడేండ్ల్లపాటు పెంచకుండా ఉన్న ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు పెంచుతోంది. తద్వారా రైతులను తీరని మోసం చేస్తోంది. వ్యవసాయేతర భూముల విలువ ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది. సామాన్యులు యాబై, వంద గజాలు కూడా కొనలేని దుస్థితి ఉంది. సుడా పరిధిలో జంటనగరాలకు మించిన రేట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా విలువ పెంచితే ప్రజలపై భారం పడుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ పెంపుదలకు నిరసనగా ఉద్యమిస్తాం.
- నున్నా నాగేశ్వరరావు,
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి