Authorization
Tue April 08, 2025 09:50:47 am
- ముగ్గురు రైతులు ఆత్మహత్య
- తెగుళ్లు, అకాల వర్షాలతో పంట నష్టం
నవతెలంగాణ-నర్మెట్ట/ మహాదేవపూర్/జైనథ్
అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు ఉమ్మడి వరంగల్, ఆదిలా బాద్ జిల్లాల్లో బుధవారం చోటుచేసుకున్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఆగాపేట గ్రామానికి చెందిన యువ రైతు నూనె రాజశేఖర్ (23) తనకున్న రెండెకరాల్లో పత్తి పంట వేశాడు. తెగుళ్లతో దిగుబడి రాలేదు. దాంతో అప్పులు తీర్చలేక ఆవేదన చెందాడు. ఈ క్రమంలో సెంట్రింగ్ పనికి వెళ్లి వస్తానని చెప్పి బుధవారం బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు. ఆయన ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. కాగా, అదే గ్రామానికి చెందిన బొడ్డు పరమేశ్వర్ తన వ్యవసాయ భూమికి వెళ్లే క్రమంలో వేప చెట్టు కింద రాజశేఖర్ పురుగుల మందు తాగి చనిపోయి కనిపించాడు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ సదానందం తెలిపారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటి పెళ్లి గ్రామానికి చెందిన పుట్ట రవి(36) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశాడు. పెట్టుబడి కోసం సుమారు రూ.12లక్షలు అప్పు అయింది. మిర్చి పంటకు తెగులు, అధిక వర్షాలతో దిగుబడి రాలేదు. దాంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసు కున్న మహాదేవపూర్ ఎస్ఐ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకొని మృతదేహా న్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని సర్పంచ్ విలాస్ రావు కోరారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గిరిజన రైతు ఎర్మా తులసీరాం(40) తన భార్య ఊరైన జైనథ్ మండలం జామ్ని గ్రామంలో నివాసముంటున్నాడు. తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆశించిన దిగుబడి రాలేదు. పంట కోసం చేసిన రూ.3లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మనోవేదనకు గురై మంగళవారం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమంచి బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు.