Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్
- పున: ప్రారంభిస్తే పూర్తి సహకారమందిస్తామని హామీ
- ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసిన సీసీఐ సాధన కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలనీ, వీలుకానిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు డిమాండ్ చేశారు. కేంద్రం దానిని పునర్ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారమందిస్తామని హామీనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ ఎంపీ జి.నగేశ్ సమక్షంలో మంత్రి కేటీఆర్‌ను సీసీఐ సాధన కమిటీ కలిసింది. మంత్రికి వినతిపత్రాన్ని అందజేసింది. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, కమిటీ కో కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, నంది రామయ్య, ఏ.అరవింద్, కొండ రమేష్, నాయకులు లోకారి పోశెట్టి, బండి దత్తాత్రి, ఈశ్వర్, సంగెపు బొర్రన్న, బుట్టి శివకుమార్, షేక్ అబ్దుల్లా, జాదవ్ వినోద్, విజ్జగిరి మనోజ్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామికంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలంటే సీసీఐ ప్రారంభించడం అత్యావశ్యకమన్నారు. ఆ ఫ్యాక్టరీని తెరిచేందుకు ఉన్న అడ్డంకులేమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కేంద్రం ప్రాంభించక పోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనీ, తాము నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రులను కలిసేందుకు కమిటీ సభ్యులను ఢిల్లీకి తీసుకెళ్తామని హామీనిచ్చారు. సీసీఐని ప్రారంభిస్తామన్న హామీతో బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ బాపూరావు తమ హామీని నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లాకు ఐటీ టవర్ ను మంజూరు చేశామనీ, ఆ జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ కృతజ్ఞతలు చెప్పారు. పున:ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.