Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'యాంటీ డ్రగ్ ఆపరేషన్ స్క్వాడ్స్' ఏర్పాటుకు ప్రణాళిక
- నేడు సీఎంకు నివేదించనున్న డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో మాదక పదార్థాల రవాణా, సేవనాన్ని నిరోధించడానికి డీజీపీ మహేందర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించినట్టు తెలిసింది. ఈ యాక్షన్ ప్లాన్ రూప కల్పనలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాలు పంచుకన్నారని సమాచారం. ముఖ్యంగా, యాంటీ నక్సలైట్ వింగ్, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ల స్థాయిలోనే యాంటీ డ్రగ్ స్పెషల్ స్క్వాడ్ల రూపకల్పనకు అధికారులు కార్యచరణను సిద్ధం చేశారని తెలిసింది. నో డ్రగ్ స్టేట్‌గా రాష్ట్రాన్ని మలచాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని సాధించడానికి గానూ పకడ్బంధీ వ్యూహంతో ఈ ప్రణాళిక రూపకల్పన జరిగినట్టు మొత్తం వెయ్యి మంది పోలీసు అధికారలు, సిబ్బందితో ఆపరేషన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే, దీనిని రాష్ట్ర స్థాయిలోనే ఏర్పాటు చేయాలా? లేదా జిల్లాలు, కమిషనరేట్ల వారీగా దీనిని విభజించి స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో స్పెషల్ ఆపరేషన్‌కు అదనపు డీజీ లేదా ఐజీ స్థాయి అధికారిని ఇంచార్జీగా నియమించనున్నట్టు సమాచారం. ఇందులో డ్రగ్ స్మగ్లర్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేక నిఘా విభాగాన్ని ఒకవైపు, వారిచ్చిన సమాచారంతో ఆపరేషన్ విభాగాన్ని మరోవైపు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విభాగానికి ఇతర రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఒక నోడల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. వీటితో పాటు ప్రతి జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగం చేస్తున్నవారి సమాచారం సేకరించడానికి స్థానికంగా నిఘా విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ విభాగం నుంచి కూడా సమన్వయమై నడవాలనీ, అందుకు అవసరమైతే జాయింట్ యాక్షన్ విభాగాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే, పోలీసు శాఖకు చెందిన కార్యచరణను ముఖ్యమంత్రి ఆమోదిస్తే సరేననీ, లేదా ఇందుకు ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే దాని ఆధారంగా ముందుకు నడవాలని కూడా పోలీసు బాస్ యోచనగా తెలిసింది. శుక్రవారం ముఖ్యమంత్రితో జరగబోయే యాంటీ డ్రగ్ నిరోధక ఉన్నతస్థాయి సమావేశానికి డీజీపీతో పాటు నగర పోలీసు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, సీఐడీ డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పోలీసు శాఖ నుంచి హాజరవుతున్నారు.