Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యకు పది శాతం, వైద్యానికి ఆరు శాతం నిధులు కేటాయించండి
- కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు తెలంగాణ పౌరస్పందన వేదిక లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి పౌరసమాజంలోని విభిన్న రంగాల వ్యక్తుల నుంచి సూచనలు ఆహ్వానించాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ కోరింది. రాబోయే కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి పదిశాతం, వైద్యరంగానికి ఆరుశాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం లేఖ రాశారు.
2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులకు సంబంధించి కొన్ని అంశాలు పరిశీలించాలని తెలిపారు. 2021-22 బడ్జెట్లో అందరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం, మూడు నుంచి ఆరేండ్ల వయస్సున్న పిల్లలకు 'ఆటపాటలతో బోధన, బోధనాశాస్త్రం, జాతీయ విద్యావిధానం-2020'కి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 38,408 పాఠశాలలు, 2,86,310 అంగన్వాడీల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేదనీ, 2,85,103 స్కూళ్లలో చేతులు కడుక్కోవడా నికి నీటిసదుపాయం లేదంటూ ఇటీవల రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. కొన్ని సర్వే నివేదికల ప్రకారం 37 శాతం పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదని తెలిపారు. అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు పది శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సూచించారు.
కానీ ప్రభుత్వాలు మూడు శాతంలోపే కేటాయించాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2019-20 బడ్జెట్లో రూ.94,853 (2.7 శాతం) కోట్లు, 2020-21 బడ్జెట్లో రూ.85,089 (2.7 శాతం) కోట్లు, 2021-22 బడ్జెట్లో రూ.93,224 (2.67 శాతం) కోట్లు కేటాయించిందని వివరించారు. నిధులను వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. కేంద్రం నిధుల వినియోగాన్ని పర్యవేక్షించే పాత్రను నిర్వహించాలని సూచించారు. దేశంలో విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకుతీసుకెళ్లడానికి రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి పదిశాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైద్యానికి ప్రజలు చేసే ఖర్చు నానాటికీ పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యరంగానికి జీడీపీలో మూడు శాతం, కేంద్ర బడ్జెట్లో ఆరు శాతానికి తక్కువ కాకుండా కేటాయించాలని కోరారు.