Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పత్తి, వరి, కూరగాయలు, మిరప, పండ్లతోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. పంట నష్టపోయిన రైతులను మంత్రులు పరామర్శించారే తప్ప నేటికి వాటి నష్టాల అంచనా వేసేందుకు సర్కారు పూనుకోలేదని విమర్శించింది. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వడగండ్లు పెద్ద పెద్ద రాళ్ల రూపంలో పడటంతో కోతకొచ్చిన మిరప, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాలో ఆరపోసిన వడ్లు కొట్టుకపోయి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని పేర్కొన్నారు.ఆ పంటలను ఇప్పటికీ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేయలేదని విమర్శించారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్ పర్యటనకు వెళతానని ప్రకటించారనీ, చివరి క్షణంలో సీఎం తన పర్యటనను ఉపసంహరించుకుని మంత్రులను పంపారని గుర్తు చేశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలంటూ జిల్లా అధికారులకు మంత్రులు చెప్పలేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని కేంద్రం దష్టికి తెచ్చి అదనపు నిధులు రాబట్టి 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రులు చేసిన ప్రకటనను అమలు చేయడానికి తక్షణమే గణాంకాలు సేకరించి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు.
రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని జంగారెడ్డి, సాగర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాగు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నల్లగొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ధాన్యం డబ్బుల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారని చెప్పారు. పంటను అమ్ముకున్న రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.