Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంజీఎస్వై రోడ్ల పనుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద చేపట్టిన రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇదే అంశంపై కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, కార్యదర్శులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సచివాలయం నుంచి ఎర్రబెల్లితో పాటు ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పనులు అత్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయని, ఎక్కడా రాజీ లేకుండా వాటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా పనులను ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర వాటా, కేంద్ర వాటా, నిర్వహణ కోసం నిధులు వేగంగా అందేలా సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం ప్రాజెక్టు (రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్), ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస యోజన పథకాలపై కూడా చర్చించారు. కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, సంబంధిత శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.