Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ జాతీయ నేత సోమనాథ్ భారతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు వచ్చే వరకు మద్దతుగా నిలుస్తామని ఆప్ జాతీయ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ఆప్ తెలంగాణ విభాగం గురువారం ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ 14 ఏండ్లుగా సేవలందించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలకు భద్రత లేదని చెప్పారు. ఇంకోవైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సీఎం కుటుంబానికే పదవులు, ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నిధుల ఖాతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను దారిమళ్లించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే నియమించాలని కోరారు. ఆప్ రాష్ట్ర కో ఇంఛార్జీ ఇందిరాశోభన్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినా కేంద్రం మౌనంగా ఉండి పట్టించుకోలేదని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల రెండేండ్ల వేతన బకాయిలతో పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.