Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జేడీల అధికారాలకు కత్తెర
- సాధారణ అంశాలకే పరిమితం
- మల్టీజోన్-1 ఉద్యోగులకు నష్టం
- సీఎం ఆదేశాలు బేఖాతర్ : టిప్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. నూతన జోనల్ విధానాన్ని రూపొందించి స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. అధికార వికేంద్రీకరణను చేపట్టింది. కానీ ఇంటర్ విద్యాశాఖలో అందుకు విరుద్ధంగా నిర్ణయాలుంటున్నాయి. అధికార కేంద్రీకరణ దిశగా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)ల అధికారాలను కత్తిరించారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ పరిధిలోనే అధికారాలన్నీ కేంద్రీకృతమయ్యాయి. ఉద్యోగుల సర్వీస్ అంశాలు, క్రమశిక్షణ చర్యలు, బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు, వారి నియామకాలు, ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాళ్ల పింఛన్ ప్రతిపాదనలు, కారుణ్య నియామకాలను ఆర్జేడీ నిర్వహించాలి. అయితే ఆర్జేడీ సాధారణ అంశాలకే పరిమితం కావాలని ఆర్సీ నెంబర్ 1/పీవో128/2021 ఉత్తర్వులను ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది, ప్రిన్సిపాళ్ల పింఛన్, కారుణ్య నియామకాలు వంటి అంశాలను పట్టించుకోవద్దని ఆదేశించారు. ప్రిన్సిపాళ్ల అంశాలను సర్వీసెస్-1 సెక్షన్, జూనియన్ లెక్చరర్ల అంశాలను సర్వీసెస్-2బి సెక్షన్, బోధనేతర సిబ్బంది అంశాలను ఓపీ-1 సెక్షన్, ఎయిడెడ్ కాలేజీల అంశాలను అడ్మిన్ సెక్షన్ పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో ఆర్జేడీలు డమ్మీలుగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక అన్ని పనులకూ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది అందరూ హైదరాబాద్‌కే రావాల్సి ఉంటుంది. దీనివల్ల మల్టీజోన్-1 పరిధిలో పనిచేసే ఉద్యోగులకు తీవ్రనష్టం కలుగుతుంది. వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.
సీఎం నిర్ణయాలకు విరుద్ధంగా ఇంటర్ విద్యాశాఖ : టిప్స్
పరిపాలనా సౌల భ్యం కోసం సీఎం కేసీఆర్ అధికార వికేంద్రీకరణ చేస్తుంటే అందుకు విరుద్ధంగా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసమని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యాశాఖలో ఏడీ, డీడీ, ఆర్జేడీ పోస్టులను డమ్మీలుగా మారుస్తున్నారని విమర్శించారు. అందువల్ల ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని సారించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. స్వార్థంతో ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు తీవ్రనష్టం కలుగుతుందని తెలిపారు. అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించకపోతే అత్యవసరమైతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెరుపు ఉద్యమాలకు వెనుకాడబోమని హెచ్చరించారు.