Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే కార్యకర్తలు, నాయకులకు శిక్షణా తరగతులు, అవగాహనా కార్యక్రమాలు
- జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు సైతం
- అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అత్యధిక మంది కేటీఆర్ అనుచరులే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెండేండ్లలో జరగబోయే రాష్ట్ర శాసనసభ, ఆ తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... సంస్థాగతంగా బలపడటంపై అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. గతేడాది నవంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనం సందర్భంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులందరికీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే... క్షేత్రస్థాయి నుంచి నిర్మాణరీత్యా పటిష్టంగా తయారైందని కొద్ది నెలల క్రితం చెన్నై పర్యటన అనంతరం ఆయన ప్రస్తావించారు. ఆ పార్టీ దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో సైతం ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని వివరించారు. అందువల్ల డీఎంకే తరహాలో టీఆర్ఎస్ను సైతం నిర్మాణపరంగా బలమైన పార్టీగా తయారు చేస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు... నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుని, ఓపెనింగ్‌కు రెడీగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాలపై సీఎం దృష్టి సారించారు. వాటిని త్వరలోనే ఆయన ప్రారంభించనున్నారు. ఆ వెంటనే శిక్షణా తరగతులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించకుండా... అక్కడి కార్యాలయాలను ప్రారంభిస్తే బావుండదని ఆయన భావించారు. అందుకే ఇప్పటికిప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారని వినికిడి. కరోనా, ఇతరత్రా పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరిలోనే పార్టీ ఆఫీసులను ప్రారంభించే అవకాశముందని సమాచారం. మరోవైపు 33 జిల్లాలకు ప్రకటించిన అధ్యక్షుల జాబితాలో ఎక్కువ మంది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులే ఉండటం గమనార్హం.