Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గానికి వంద యూనిట్ల పంపిణీకి కసరత్తు
- సోమవారం నుంచే ప్రారంభమైన స్కీం ప్రక్రియ
- పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో వంద శాతం పూర్తి
- 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల్లోనే లబ్దిదారుల ఎంపిక
- డెయిరీ, ట్రాన్స్‌పోర్టు యూనిట్లకే ప్రాధాన్యత
- లక్ష లీటర్ల పాలనూ సేకరిస్తామంటున్న కరీంనగర్ డెయిరీ చైర్మెన్
- ఈ తొలిదఫాలో స్కీం అందేది గ్రామానికి ఒక్కరికే !
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2021 ఆగస్టు 16న ప్రారంభమైన దళితబంధు స్కీం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పూర్తి దశకు చేరుకుంది. ఉప ఎన్నిక అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో.. ఈనెల 22న సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్కీం అమలుపై జిల్లాల కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు.
నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున అందించనుండగా.. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేల చేతుల్లోనే పెట్టారు. హుజూరాబాద్‌లో మెజార్టీ ల్ద్ధదారులు డెయిరీ, ట్రాన్స్‌పోర్టు యూనిట్లనే ఎంచుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు ఆ యూనిట్ల ఎంపిక పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పాల ఉత్పత్తి గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో ఆ పాలకు మార్కెట్ కల్పించేందుకు మరో లక్ష లీటర్లు అయినా సేకరిస్తామని కరీంనగర్ డెయిరీ చైర్మెన్ చలిమెడ రాజేశ్వర్‌రావు మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించడం గమనార్హం. అయితే, తొలి దఫాలో నియోజకవర్గానికి వంద యూనిట్లే.. అంటే గ్రామానికి ఒక్కరు లేదా ఇద్దరికి మాత్రమే యూనిట్లు అందనున్నాయి.
దళితుల్లో ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చేందుకు దళిత కుటుంబానికి దళితబంధు కింద రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. అదే నెలలో 16న హుజూరాబాద్ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన వేదిక మీదుగా 10 మంది లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఏ స్థాయితోనూ సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద జిల్లా యంత్రాంగాన్ని మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గానికి పంపి జల్లెడ పట్టించారు. 17వేల 556 మంది దళిత కుటుంబాల లబ్దిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ చేశారు. ఇందులో 1500 కుటుంబాలకుపైగా డెయిరీ యూనిట్లనే ఎంచుకున్నారు. 6800 మంది ట్రాన్స్‌పోర్టు యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. వారికి ఆయా యూనిట్ల నిర్వహణ పట్ల ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. డెయిరీ యూనిట్లలో గేదెల షెడ్లు నిర్మించేందుకు రూ.లక్షా 50వేలు ప్రభుత్వం అందించింది. మొత్తంగా హార్వెస్టర్లు, జేసీబీలు, లారీలు, డీసీఎమ్‌లు, ప్రయివేటు కార్లు.. ఇలా ట్రాన్స్‌పోర్టు యూనిట్లను ప్రభుత్వం అందజేసింది. ఈనెల 21న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనూ పలువురు లబ్దిదారులకు అందించింది.
మిగతా నియోజకవర్గాల్లో గ్రామానికి ఒకరిద్దరికే..
పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మినహాస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి వంద యూనిట్లనే అందిస్తున్న ప్రభుత్వం ఒక్కో గ్రామానికి ఒక్కరు లేదా ఇద్దరికే వర్తింపజేయనుంది. ఈ క్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలతోకూడిన ఆదేశాలు ప్రభుత్వం నుంచి జారీ అయ్యాయి. ఈ మార్చి 31లోపు లబ్దిదారులను ఎంపిక చేసి యూనిట్లు పంపిణీ చేయాలని చెప్పింది. యూనిట్ల ఎంపిక పూర్తిగా లబ్దిదారుని ఆసక్తిపైనే వదిలేయాలని చెప్పిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఎక్కువగా డెయిరీ నెలకొల్పేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.