Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలకు 'సహకారం'.. పేదలపై ప్రతీకారం
- కరోనా కష్టకాలంలో తెగబడిన డీసీసీబీ
- ఇళ్లు సీజ్.. సామగ్రి జప్తు చేస్తున్న వైనం
- భయాందోళనతో అష్టకష్టాలు పడి బకాయి చెల్లింపు
- బంగారం తాకట్టు.. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. విముక్తి
- రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులు, లక్షలాది మంది పేదలపై పంజా
- రూ.కోట్లలో బకాయి, అక్రమాలకు పాల్పడినా కొందరికి 'సహకారం'
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) రుణాలు రైతులు, పేదల పాలిట గుదిబండలుగా మారాయి. కరోనా కష్టకాలానికి తోడు పంటలు సరిగ్గా పండక.. పండిన అరకొర పంట చేతికి రాని సమయంలో బ్యాంకు సిబ్బంది వసూళ్లకు దిగడం.. నోటీసులు ఇవ్వడం.. ఇండ్లకు తాళాలు వేయడం.. సామాన్లు జప్తు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో రుణగ్రహీతలు లబోదిబోమంటున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రూ.కోట్లలో రుణం పొంది బ్యాంకును దగా చేసిన కొందరు పెద్దలు, అధికారులను వదిలి రూ.వేలల్లో బకాయి ఉన్న తమతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆక్షేపిస్తున్నారు. అయినా రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది రైతులకు చెందిన రూ.2,558 కోట్లు వసూలు చేయక తప్పదని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) హెచ్చరిస్తోంది. ఇటీవల ఖమ్మంజిల్లాలోని జేఎల్‌జీ (జాయింట్ లయబిలిటీ గ్రూప్) సభ్యులు ఒక్కొక్కరి నుంచి కేవలం రూ.20,200 వసూలు విషయంలో డీసీసీబీ సిబ్బంది వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. అయినప్పటీకీ 'తగ్గేదేలే...' అనే రీతిలో సహకార బ్యాంకు వ్యవహారశైలి ఉండటంతో బకాయిదారులు బంగారం తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని చెల్లిస్తున్నారు. కామేపల్లి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వైరా మండలాల్లో ఈతరహాదాడులు కొనసాగాయి. ఈ విషయ మై 'నవతెలంగాణ' గురువారం కామేపల్లి మండలం గరిడే పల్లిలో కొందరు జేఎల్‌జీ సభ్యులను కలవడంతో బ్యాంకోళ్లు పెట్టిన బాధలు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
బంగారం తాకట్టు పెట్టా.. రూ.5కు వడ్డీకి తీసుకున్నా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు.. భూక్య రామ, ధారవత్ బావ్‌సింగ్. ఈ ఇద్దరిదీ కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామం. 2015లో వీరితో పాటు మరో ముగ్గురు గ్రూప్‌గా ఏర్పడి రూ.50వేల రుణం పొందారు. తలా రూ.10వేల చొప్పున పంచుకున్నారు. అదనంగా మరో రూ.50వేలు కూడా ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. కానీ అదనపు రుణం ఎంతకూ ఇవ్వకపోవడంతో వీరు వాయిదా చెల్లించడం మానేశారు. 2017 నుంచి వీరి గ్రూపు బ్యాంకుకు బకాయిపడిందనే పేరుతో రూ.20,200 చెల్లిం చాలని నోటీసులు ఇచ్చారు. ఇండ్లకు కూడా అంటించారు. రూ.పదివేలకు 20వేలు చెల్లించలేమని వీరు ఎంత ప్రాధే యపడినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఇటీవల ఇండ్లకు తాళాలు వేయడంతో రోజంతా కుటుంబంతో చలిలో బయట ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గత్యంతరం లేక భార్య గుర్తుగా దాచుకున్న బంగారాన్ని తాకట్టుపెట్టి భూక్య రామ బకాయి చెల్లించాడు. చేతిలో చిల్లిగవ్వ లేని ధరావత్ భావ్‌సింగ్ నూటికి రూ.5 వడ్డీచొప్పున అప్పు తీసుకుని బ్యాంకు బకాయి తీర్చాడు. రూ.15వేల చొప్పున మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని భావ్‌సింగ్ మిర్చి పంట వేశాడు. పంట మొత్తం తామర పురుగు బారిన పడటంతో కిలో మిరపకాయలు కూడా దిగుబడి రాలేదు. పూట గడవడమే కష్టమవుతున్న తరుణంలో బ్యాంకు అప్పు ముప్పుగా పరిణమించిందని లబోదిబోమంటున్నాడు. ఆత్మాభిమానం చంపుకోలేక రూ.5కు అప్పుతీసుకున్నా. కానీ ఆ రుణం ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని కంటనీరు పెడుతున్నాడు. యాసంగి పంట కూడా పండకపోతే తమ కుటుంబ పరిస్థితి ఏమిగానూ.. అని వాపోయాడు. ఇదీ వీరిద్దరి పరిస్థితే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బ్యాంకు బకాయిల వసూలు నిలుపుదల చేయాలనీ, ఎకరం మిర్చికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
రూ.కోట్లు తీసుకున్నోళ్ల సంగతేంటి?
ఇదిలావుండగా 2016-17లో ఖమ్మంలోని ఎన్ఎస్టీ, రోటరీనగర్ మెయిన్ బ్రాంచీల్లో కొందరు నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా రూ.6.70 కోట్ల గోల్మాల్ చేశారు. ఈ విషయంలో మొత్తం 22 మందిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల పీఏసీఎస్‌లో గత పాలకవర్గం హయాంలో అనర్హులకు లోన్లు ఇచ్చారు. 362 మందికి రుణాలివ్వగా ఇందులో 46 మందే కొత్త పాస్‌బుక్‌లను ష్యూరిటీగా పెట్టారు.
ఒక్కో ఇంట్లో ఐదు నుంచి పది మంది లోన్లు తీసుకున్నారు. పక్క జిల్లాకు చెందిన వారికీ లోన్లు శాంక్షన్ చేశారు. రంగారెడ్డి జిల్లా సహకార బ్యాంకులోనూ ఇలాంటి అవకతవకలే జరిగాయి. రూ.కోట్లలో అవినీతి చోటుచేసుకుంది. ఇంకా పలు బ్యాంకుల్లో పెద్దలు, పాలకవర్గ సభ్యులు కొందరు ఇలా తప్పుడు మార్గంలో రుణాలు పొందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ పేదలు, రైతులపై ప్రతాపం చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది.
పొంచివున్న 'సహకార' అప్పు.. ముప్పు
రాష్ట్రంలో 9 డీసీసీబీలున్నాయి. వీటి పరిధిలో 372 బ్రాంచీలు, 820 సహకార సంఘాలున్నాయి. ఆయా సహకార బ్యాంకులు దాదాపు పది లక్షల మందికి రుణాలిచ్చాయి. రైతాంగంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి రుణాలు ఇస్తున్నాయి. వ్యాపార రుణాలు, జేఎల్‌జీ రుణాలు ఇస్తున్నాయి. వీటిలో 90% రైతులకు చెందిన రుణాలే ఉన్నాయి. టెస్కాబ్ లెక్కల ప్రకారం డీసీసీబీల్లో రూ.5,310 కోట్ల బకాయిలు పేరుకుపోగా రూ.2,752 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.2,558 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దీర్ఘకాలిక రుణాలు రూ.738 కోట్లు, పంట రుణాలు రూ.1,820 కోట్లు ఉన్నాయి.
దీర్ఘకాలిక రుణాలపైనే డీసీసీబీలు దృష్టి సారించాయి. ఈ రుణాలు తీసుకున్న రైతులే 2లక్షల మంది వరకు ఉన్నారు. ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.616 కోట్ల బకాయిలున్నాయి. వీటిలో క్రాప్లోన్లు రూ.450 కోట్లు, బిజినెస్, మార్టిగేజ్ లోన్లు రూ.150 కోట్లు, జేఎల్‌జీ లోన్లు రూ.16 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రుణమాఫీ పరిధిలోని పంట రుణాలు మినహా మిగిలిన బకాయిల విషయంలో తగ్గేదేలే.. అనే రీతిలో డీసీసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.