Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాబార్డ్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి
- రూ. లక్షా 66వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యవసాయ రంగానికి రుణ పరపతిని పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. జనాభాలో 60శాతం మంది ఆధారపడిన ఈ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్దరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి (2022-23) నాబార్డు రూపొందించిన రూ లక్షా 66 వేల 384 కోట్ల రుణ ప్రణాళికను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి నిరంజన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు పథకాన్ని పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయని చెప్పారు. పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. కానీ సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యతలను గుర్తించి పంట వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆయిల్‌పామ్ వంటి ధీర్ఘకాలిక పంట సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని వివరించారు. దీనికోసం నాబార్డు సూచనలమేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆ పంట సాగుకు సహకరించాలని సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ది రంగంలో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నదనీ, సహకార రంగానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.