Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సర్కారు చర్యలకు నిరసన
- ఏఐకేఎస్‌సీసీ పిలుపు
- కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతువ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 31న విద్రోహ దినాన్ని పాటించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు శుక్రవారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్రోహ దినాన్ని పాటించాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌పై ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ... ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లఖింపూర్ ఖేరీ మారణకాండ కేసులో నిందితులను రక్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్ మోర్చా 'శాశ్వత ధర్నా' నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దాంతోపాటు ఎస్కేఎం ముందుగానే ప్రకటించినట్టు 'మిషన్ ఉత్తరప్రదేశ్' కొనసాగుతున్నదని పేర్కొన్నారు. రైతు ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీని ఆ ప్రభుత్వంతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రభుత్వాలు కూడా మరచిపోయాయని విమర్శించారు. రైతులకు పరిహారం విషయంలో కూడా ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.