Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ లోని కస్తూర్బా నగర్ లో 20 సంవత్సరాల మహిళ పై సామూహిక లైంగికదాడికి పాల్పడి అత్యంత దారుణంగా అవమానించిన దోషులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య పార్కు వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో లైంగికదాడి నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున దేశమంతా వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఢిల్లీలో 20 సంవత్సరాల మహిళను ఇంట్లో నుండి ఎత్తుకుపోయి ముగ్గురు యువకులు క్రూరంగా లైంగిక దాడిచేయటం ధారుణమన్నారు. ఆమె జుట్టు కత్తిరించి మొహానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండ వేసి బెల్టులతో కొడుతూ ఊరంతా ఊరేగించడంపై పాలకులు సిగ్గుపడాలని విమర్శించారు. నిరంతరం మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్న ప్రభాత్వాధి నేతలు..మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పైగా మహిళల ప్రవర్తనపై బీజేపీ మంత్రులు, బాధ్యతకలిగిన వ్యక్తులు వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. నిందితులను వెంటనే (13 మందిని) అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దారుణాలు జరిగిన ఘటనల్లో మద్యం, డ్రగ్స్ ఎక్కువగా సేవిస్తున్నారనే విషయం అనేక విచారణల్లో తేలిందన్నారు. ఈ నేపథ్యంలోనే మద్యాన్ని, డ్రగ్స్, ఫోర్న్ వీడియోలను నియంత్రించాలని కోరా రు. ఇప్పటికైనా మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి, ఉపాధ్యక్షులు కేఎన్ ఆశాలత, లక్ష్మమ్మ సహాయ కార్యదర్శులు ఎం వినోద, కె నాగలక్ష్మి రాష్ట్ర సమిటి సభ్యులు ఎం స్వర్ణలత, పద్మ, షబానా, ప్రేమ, భవాని తదితరులు పాల్గొన్నారు.