Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్
- బాధిత కుటుంబాలకు సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నాయకుల పరామర్శ
- కల్తీ మద్యం తాగి చనిపోయిన ఐదు కుటుంబాలకు రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
నవతెలంగాణ-మెదక్ డెస్క్
కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామ దళితులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసుల్లో జైలులో ఉన్న బాధిత కుటుంబాలను శుక్రవారం సీపీఐ(ఎం), కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఘటనకు దారి తీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట వారికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ.. జనవరి 17న దళితుడైన నరసింహులు గ్రామంలోని బెల్డ్షాపులో మద్యం తాగి షాపు ముందే చనిపోయాడని తెలిపారు. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, బెల్టుషాపులను అరికట్టాలని అడిగినందుకు 19 మంది దళితులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని తెలిపారు. వారిలో 13 మంది దళితులు జైల్లో మగ్గుతుండగా, అందులో నలుగురు మహిళలున్నారని, ఇందులో కండ్లు పూర్తిగా కనిపించని అమ్మాయి శ్రీలత ,60 ఏండ్ల వృద్ధురాలిపై కేసు పెట్టడాన్ని బట్టి ఎంత కుట్ర దాగి ఉందో అర్థమవుతుందని ఆరోపించారు. ఒక్క చిన్న గ్రామంలోనే ఆరు బెల్టు షాపులున్నాయంటే మద్యం మత్తు ఏ రూపంలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులతో ఇప్పటికే అనేక మంది తాగుడుకు బానిసై తమ పచ్చని కుటుంబాలు గుగ్గిపాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం మూలంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా దళితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించి చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో.. కెేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాజయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి బాబురావు, కేవీపీఎస్ మండల నాయకులు బాలకృష్ణ, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు, దళితులు పాల్గొన్నారు.