Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీ బాయి
- పోతురాజు జాతరకు పోటెత్తిన గిరిజనులు
నవతెలంగాణ-కెరమెరి
గిరిజనుల సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడాలని మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు. శుక్రవారం మండ లంలోని ఇందాపూర్ సమీపంలో పోతురాజు, ధర్మరాజు ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఆదిమజాతి కొలాం గిరిజన సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొలాం తెగల కొంగు బంగారంగా వెలసిల్లుతున్న పోతురాజు ధర్మరాజు ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆదిమ గిరిజనులు నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆదిమజాతి గిరిజనులు విద్యా, ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. పోతురాజు ధర్మరాజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడా పోటీలను ప్రారంభించారు. ధనోర గ్రామంలోని జంగుబాయి దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందూర్ మోతీరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, ఎమ్మెల్యే తనయుడు, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షులు ఆత్రం వినోద్, సర్పంచులు కావుడే తులసీరాం, తొడసం జగన్నాథ్రావు, ధనోర తదితరులు పాల్గొన్నారు.
పోటెక్కిన సందర్శకులు
పోతురాజు జాతరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిమజాతి గిరిజనులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. గురువారం నుంచి ఆయా గ్రామాల నుంచి పోతురాజు ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం సహా పంక్తి భోజనాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.