Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కాజీపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
- 31న రైల్వే జీఎం కార్యాలయం ముట్టడి
- అఖిలపక్ష సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ- హనుమకొండ
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పే వరకు ఐక్య ఉద్యమం చేస్తామని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా విభజన చట్టంలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ తదితర హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. పైపెచ్చు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి బడాబాబులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్య ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాయని, ఆ స్ఫూర్తితోనే రైౖల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించాలన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో కాకుండా విభజన హామీలు నెరవేర్చాలని ఢిల్లీలో పోరాడాలని హితవు పలికారు. కాజీపేటలో భూమి ఇవ్వకపోవడం వల్లనే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ, 50ఎకరాల భూమి అడిగితే తాము 150ఎకరాల దేవాలయ భూమి కొనుగోలు చేసి రైల్వే జీఎంకు అప్పగించామని చెప్పారు. సంబంధిత పత్రాలను విలేకరులకు చూపించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు సోయి తెచ్చుకొని ప్రజల ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని కాంగ్రెస్ తీర్మానం చేసిందని, కానీ అధికారంలోకి రాకపోవడంతో ఏర్పాటు చేయలేకపోయామని అన్నారు. ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే బడ్జెట్లో కోచ్ ఫ్యాక్టరీతోపాటు ఇతర హామీలు నెరవేర్చాలని శనివారం ఉదయం 11గంటలకు కాజీపేటలో రాస్తారోకో చేపట్టాలని, 31న హైదరాబాద్‌లో రైల్వే జీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే కోచ్ ఫ్యాక్టరీ సాధన, ఉద్యమ కార్యాచరణను సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు రూపొందించాలని అఖిలపక్షం తీర్మానించింది. ఈ సమావేశంలో ఎంపీ దయాకర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గొడుగు వెంకట్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బిక్షపతి, కూడా మాజీ చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, రైల్వే స్టేట్ జాక్ చైర్మెన్, సీపీఐ(ఎంల్) స్టేట్ సెక్రటరీ నున్న అప్పారావు, టీఆర్ఎస్ నాయకుడు నార్లగిరి రమేష్, టీడీపీ నాయకుడు ఖాదర్ బాబా, అంబేద్కర్ పూలే జిల్లా కార్యదర్శి అంబేద్కర్, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.