Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వర్ సమస్యతో నిలిచిపోయిన పోర్టల్
- గంటల తరబడి ఆలస్యమౌతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
- ఫిబ్రవరి 1నుంచి భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు జనం క్యూ
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన తాకిడి
నవ తెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన రామయ్య తనకున్న 26 గుంటల భూమిలో కొంతమేర మరో వ్యక్తికి విక్రయించాలని 10 రోజుల కిందట నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అగ్రిమెంట్ అయిన ఐదు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని కొనుగోలుదారుడు చెప్పడంతో ధరణి వెబ్సైట్ ద్వారా ఈనెల 24 వ తేదీకి స్లాట్ బుక్ చేసుకున్నాడు. అనివార్యకారణాలు, సాంకేతిక సమస్యతో ఆరోజు బుకింగ్ రద్దయింది. దాంతో చేసేదేమీ లేక మరోసారి అదనంగా రూ.1000 చెల్లించి ఈనెల 27వ తేదీకి స్లాట్ బుక్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లగా మళ్లీ ధరణి సర్వర్ మొరాయించింది. మరోసారి స్లాట్ బుక్ చేసుకోండని అధికారులు చెప్పడంతో నిరాశగా ఇంటికి తిరిగివచ్చారు. 28 తేదీని బుకింగ్ కోసం ఎంతగా ప్రయత్నించినా స్లాట్ కూడా బుక్ కాలేదు. దాంతో ఏంచేయాలో అర్థంకాక తలపట్టుకున్నాడు. అవసరానికి డబ్బు వస్తుందనుకుంటే ధరణితో నెత్తినొస్తోందని రామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్టేషన్ ఛార్జీలు పెంచితే మళ్లీ ఎంతడబ్బు అదనంగా చెల్లించాలోనని వాపోయాడు.
ఛార్జీల పెంపు కారణంగానే..
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువ పెంచనున్నట్టు ప్రభుత్వం నాలుగు రోజుల కిందట చేసిన ప్రకటన ధరణి వెబ్‌సైట్‌ను క్రాష్ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువల సవరణకు టైం వచ్చేసిందంటూ జరుగుతున్న ప్రచారంతో ఇప్పటికే భూములు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నవారు మీసేవా కేంద్రాలకు.. ఆన్లైన్ సర్వీస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెరగడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో రద్దీ ఎక్కువైంది. సాధారణ రోజుల్లో రోజుకు 15 నుంచి 20 రిజిస్ట్రేషన్లు చేసే తహసీల్దార్ కార్యాలయానికి ఏకంగా ముప్పై మంది వచ్చేయడం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ధరణి వెబ్సైట్ వాడటం పెరిగిపోవడంతో సర్వర్ మొరాయిస్తున్నది. దాంతో ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకు అమ్మకందారులు, కొనుగోలుదారులు మండలాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా.. వాటిలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్- జోగిపేట, నారాయణఖేడ్, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల్ - హుస్నాబాద్ లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా.. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నాలుగు రోజులుగా జనం కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నారు. భూముల మార్కెట్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ జనం నుంచి సంపన్నుల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూకడుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో రోజుకు 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుండగా.. నాలుగు రోజులుగా వందలాది మంది డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరలివస్తున్నారు. దాంతో రాత్రి 11 గంటల వరకు కూడా కార్యకలాపాలు సాగుతున్నాయి. అంతేకాదు, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి సర్వర్‌తో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గురు, శుక్రవారాల్లో దాదాపు 47 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. వీటి కోసం వచ్చిన వారంతా సాయంత్రం వరకు వేచి చూసి చేసేది లేక వెనుదిరిగారు.
సర్వర్ సమస్యతో ఆలస్యమౌతోంది
మూడు రోజులుగా ధరణి పోర్టల్ సర్వర్ సేవలు సక్రమంగా సాగడం లేదు. సాధారణంగా ప్రతిరోజూ 30 వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకుంటారు. సమయంతో సంబంధం లేకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా నిత్యం సుమారు రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు సర్వర్ సమస్యతో మరింత ఆలస్యమౌతున్నది.
-షేక్ ఆరిఫా, చేర్యాల తహసీల్దార్
రెండు రోజులుగా ఇబ్బంది ఉంది
గురువారం 18 రిజిస్ట్రేషన్లు చేయవలసి ఉండగా ధరణి పోర్టల్ సమస్యతో 9 మాత్రమే పూర్తయ్యాయి. శుక్రవారం 22 దరఖాస్తులు వచ్చాయి. సర్వర్ సరిగ్గా రాకపోవడంతో రిజిస్ట్రేషన్ లేటవుతున్న మాట వాస్తవమే. రాత్రి లేటయినా రిజిస్ట్రేషన్ పూర్తిచేసే మేము కూడా ఇండ్లకు వెళ్తున్నాం. తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది కూడా లేట్ అవర్స్‌లో పనిచేస్తున్నారు.
- కృష్ణమోహన్, తోగుట తహసీల్దార్
గంటల తరబడి వేచి ఉన్నాం
భూమి పట్టా మార్పుకోసం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం. ధరణి పోర్టల్ పదేపదే నిలిచిపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నాం. తొందరగా రిజిస్ట్రేషన్ పని ముగించుకుని వ్యవసాయ కార్యకలాపాలు చూసుకుందామంటే సర్వర్ సమస్య అలాగే కొనసాగుతున్నది. అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం అంటున్నారు.
- రేపాక బాల్ చంద్రం, రైతు,వెంకట్రావు పేట, తొగుట మండలం