Authorization
Tue April 08, 2025 06:02:04 am
- మొన్న పీజీ.. నేడు పీహెచ్డీ ఫీజుల పెంపు
- విద్యార్థుల పరిశోధనలకు ఆటంకం
- ఫీజులు తగ్గించాలంటున్న విద్యార్థులు
- మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం : ఓయూ వీసీ
నవతెలంగాణ-ఓయూ
ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎన్నో కలలు కని.. కష్టపడి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కరోనా కాలంలోనూ ఫీజులు భారంగా మారాయి. ఉచిత విద్య, వసతి లభిస్తుందని ఎన్నో ఆశలతో ఓయూలో అడుగుపెట్టే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫీజుల భారంతో వేదనకు గురవుతున్నారు. ఇటీవలెనే పీజీ ఫీజులు పెంచిన అధికారులు.. ఇప్పుడు పీహెచ్డీ ఫీజులను పెంచారు. అసలే కరోనా కాలం, పెంచిన ఫీజులతో ఆర్థికపరంగా అవస్థలు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెంచిన పీజీ ఫీజుల వివరాలు..
ఆర్ట్స్‌కు రూ.2800 నుంచి 14 వేలు, సైన్స్‌కు రూ.3,800 నుంచి రూ. 20,490 పెంచారు. ఈ పెంపుభారం తమ చదువులపై, పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెంచిన ఫీజుల వల్ల పరిశోధన పూర్తి చేయాలంటే అదనంగా రూ.50 వేల భారం పడుతుంది. ఇక పీహెచ్డీ ఎక్స్టెన్షన్ (గడువు పెంపు) గతంలో రూ.6,000 ఉండగా.. రూ.11వేలకు పెంచుతూ ఇటీవల అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పెంచిన పీహెచ్డీ ఫీజులు అమలు చేయాలని జనవరి 25న జరిగిన డీన్స్ సమావేశంలో ఉన్నతాధికారులు డీన్స్‌కు సూచించారు. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మొరపెట్టుకున్నా, వినతిపత్రాలు అందజేసినా వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గలేదు.
యూనివర్సిటీకి నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో లేక యూజీసీ, రుసా, ఇతర ప్రాజెక్ట్స్ నుంచి కొట్లాడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. కానీ ప్రయివేటు వర్సిటీల మాదిరి ఫీజులు పెంచడం, వసూలు చేయడంతో విద్యార్థులపై ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు, పరిశోధనలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులతో వర్సిటీకి ఆర్థిక పరిపుష్టి వస్తుందన్న ధోరణి కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు. మరోవైపు ఓయూ పీహెచ్డీ పరిశోధన గ్రంథాల సమర్పణలో నాణ్యత కొరవడిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
యూనివర్సిటీనే భరించాలి
విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా యూనివర్సిటీయే భరించి పరిశోధనకు సహకరించాలి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఫెలోషిప్‌లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వర్సిటీయే సౌకర్యాలు కల్పించాలి.
ఏఐఎస్ఎఫ్ నేత కంపెల్లి శ్రీనివాస్
ఫీజుల పెంపు అత్యంత బాధాకరం
వర్సిటీలో పీజీ, పీహెచ్డీ ఫీజుల పెంపుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాంటిది ఓయూ అధికారులు ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం హాస్యాస్పదం. ఈ ఫీజుల పెంపు నేపథ్యంలో ఓయూ ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యం.. బకాయిలు చెల్లిస్తేనే టీసీ, మెమో ఇస్తామని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తుస్తోంది.
ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్
మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం
విద్యార్థులు సమర్పించే థీసెస్‌కు ఫీజును మాత్రమే పెంచాం. గతంలో రూ. 5 000 ఉన్న ఫీజును రూ.10,500కు పెంచాం. గతంలోలాగా మూల్యాంకనం చేసేందుకు లెక్చరర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీహెచ్డీ విద్యార్థుల అవార్డ్స్ ఆలస్యం అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనానికి సంబంధించిన ఫీజు మాత్రమే పెంచాం. దీని ద్వారా పీహెచ్డీ విద్యార్థులకు త్వరితగతిన అవార్డ్ వచ్చే అవకాశం ఉంది. ఏ సంవత్సరంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఏ మేరకు ఫీజులు చెల్లించాలన్న పూర్తి వివరాలతో కూడిన పట్టికను విడుదల చేస్తాం.
ఓయూ వీసీ ప్రొ.రవీందర్