Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నవోదయ విద్యాలయాలు, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి పలు విద్యా సంస్థలను మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదనీ, కనీసం సొంతంగానైనా వారెలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌ను మినహాయిస్తే 9నవోదయ విద్యాలయా లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రానికి మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఇవి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
షర్మిలది అవగాహన రాహిత్యం
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారా అమలవుతున్నదని వివరించారు. ఎల్ఐసీ, జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉన్నదన్నారు. ఆ ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామన్నారు..