Authorization
Tue April 08, 2025 08:54:45 am
నవతెలంగాణ-కల్చరల్
బడుగు బలహీన వర్గాల వ్యథలు, వెతలు, అక్రోశం తనదిగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో కొట్లాడిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అస్తమించారు. శుక్రవారం తెల్లవారుజామున సుధాకర్ హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలోని పాముల బస్తీలో 1959లో దేవయ్య, శాంత బాయిలకు జన్మించిన సుధాకరరావు అంబేద్కర్ ఆశయ మార్గంలో మానవత, బహుజన అభ్యున్నతిని ఆకాంక్షించారు. ప్రఖ్యాత కవి డాక్టర్ సీ నారాయణ రెడ్డి శిష్యులుగా ఉన్నత విద్యలో పట్టపొందారు. తెలుగు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ఆరంభించిన అయన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారు. జాషువా తర్వాత దళిత సాహిత్యంలో అంత బలమైన ముద్రవేసిన సుధాకర్ 'వర్తమానం' కొత్త గబ్బిలం, 'నా అక్షరమే నా ఆయుధం' నల్ల ద్రాక్ష పందిరి' తెలి వెన్నెల, కథానాయకుడు జాషువా వంటి పలు రచనలతో కొత్త ఒరవడిని సష్టించారు. సుధాకర్ భార్య హేమలత కూడా రచయిత్రి, సామాజిక కార్య కర్త. కాగా గతేడాది కోవిడ్‌తో మరణించడంతో ఆయనకు ఎనలేని దుక్కాన్ని మిగిల్చింది. ఇరువురు కుమార్తెలు మానస, మనోజ్ఞ కాగా మానస కథా రచయిత్రిగా ' మిలింద' కథ సంపుటికి 2020 లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. సుధాకర్ కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యులు. తెలుగు విశ్వవిద్యాలయం ధర్మ నిధి పురస్కారం, సినారె పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది పురస్కారం వంటి ప్రభుత్వ పురస్కారాలతో పాటు వివిధ సాహిత్య సంస్థలు యువకళావహిని, వంశీ జనటర్నేషల్ తదితర సంస్థల నుంచి సత్కారాలు పొందారు.
పలువురు సంతాపం
సుధాకర్ మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు కవులు కళా సంస్థల నిర్వహకులు సంతాపం తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మెన్ గౌరీశంకర్, భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరం, కవులు నందిని సిధారెడ్డి, శివా రెడ్డి, బైస దేవ దాస్, వంశీ రామ రాజు, కిన్నెర రఘురామ్, గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి తదితరులు సంతాపం ప్రకటించారు. సామాజిక అసమానతలపై కలం పట్టి యుద్ధం చేసిన డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ అకాల మరణం సామాజిక, సాహిత్య ఉద్యమాలకు తీరని లోటని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఎండ్లూరి భౌతికకాయానికి బెడ బుడిగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు, అంబేద్కర్ పూలే యువజన సంఘం సభ్యులు హరికృష్ణతో కలిసి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సుధాకర్ మరణించడం తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతికి గురైందనీ, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె ఆనందాచారి పేర్కొన్నారు. సుధాకర్ మృతికి సంతాపం తెలిపారు. తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో విశేషమైన కృషి చేసి, తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఆయన మృతి సాహిత్యరంగానికి తీరని లోటని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్ష కార్యదర్శులు కెంగార మోహన్, కె సత్యరంజన్ పేర్కొ న్నారు.