Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా ఉపాధ్యాయుల ఇబ్బందులు
- భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలి
- పరస్పర బదిలీల దరఖాస్తులను ప్రభుత్వమే స్వీకరించాలి
- యూఎస్పీసీ పోరాటానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఉపాధ్యాయుల సమస్య లను పరిష్కరించే బాధ్యతను సంపూర్ణంగా నాకు అప్పగించండి. అన్ని రకాల సమాచారం ఇవ్వండి. నేను రాష్ట్రంలో ఎలాంటి చిన్న సమస్య లేకుండా పరిష్కరిస్తానన్న నమ్మకముంది. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు పూనుకోవాలి. ఉపాధ్యాయుల ఆందోళనలను విరమింపజేయాలి.'అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియాపాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రెండు నెలలుగా ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. లక్షమందికిపైగా ఉపాధ్యాయులు జిల్లా క్యాడర్లో ఉన్నారనీ, జిల్లాల కేటాయింపులు జరిగాయని చెప్పారు. జిల్లాలు చిన్నవి కావడం వల్ల సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాలుగా విభజించబడిందనీ, సిద్ధిపేట జిల్లాలోకి కొంత భాగం వెళ్లిందని వివరించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యాయులను ఏడు జిల్లాలకు కేటాయించారని చెప్పారు. సీనియార్టీ సమస్యలున్నాయనీ, అధికారులు వాటిని పరిష్కరించడం లేదని విమర్శించారు. శనివారం జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి యూఎస్పీసీ పిలుపునిచ్చిందనీ, వచ్చేనెల ఐదున హైదరాబాద్లో మహాధర్నా ఉంటుందనీ, ఈ క్రమంలో ఉపాధ్యాయుల నిరసనలకు తన మద్దతు ఉంటుందన్నారు. ఐదారు రకాల సమస్యలను పరిష్కరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సూచించారు. టీచర్లు తమ స్థానికతను కోల్పోయామనీ, సొంత జిల్లాకు పంపాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని అన్నారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తులు ఆరు వేల వరకు ఉన్నాయని చెప్పారు. స్థానికత సమస్య పరిష్కారం కోసం పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలని కోరారు. ప్రభుత్వమే దరఖాస్తులను స్వీకరించాలనీ, ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. అయితే పరస్పర బదిలీలకు కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు రేట్లు మాట్లాడుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి నీచ పద్ధతికి ఒడిగట్టి ఉపాధ్యాయ వృత్తికి అప్రతిష్ట తేవొద్దని విజ్ఞప్తి చేశారు. ఒంటరి, వితంతు మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించి ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.