Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం
- రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే : హరీశ్ రావు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్ రెండో దశలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన జ్వర సర్వే దేశానికే ఆదర్శమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు సైతం దీనిపై ప్రశంసలు కురిపించాయని గుర్తు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన క్యాథ్ ల్యాబ్, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్‌ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాత, శిశుసంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఫీవర్ సర్వేను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంస్థలు సూచించాయని తెలిపారు. రాష్ట్రంలో జ్వర సర్వే పలు జిల్లాల్లో ముగిసిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేసి 3,45,951 కిట్లను అందించామని తెలిపారు. టెస్టింగ్, హౌం ఐసోలేషన్ కిట్లకు కొదువ లేదన్నారు. వ్యాక్సినేషన్ రెండు డోసులు వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ దక్షిణ భారతదేశంలోనే ముందుందని చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో 94 శాతంతో ఖమ్మం జిల్లా ఉందన్నారు. మంత్రి అజరు, జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు దృష్టి సారించి జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలన్నారు. రూ. 7.5 కోట్లతో క్యాథ్ ల్యాబ్ ప్రారంభించుకున్నామనీ, ఇది రాష్ట్రంలోనే నాల్గవ ల్యాబ్ అని తెలిపారు. ఈ సేవలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయనీ, రాష్ట్రంలో నిమ్స్, ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌కు దూరంలో ఖమ్మం ఉన్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల సౌలభ్యం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనున్నదన్నారు. కార్డియాలజిస్టులనూ నియమించామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజరు కోరిక మేరకు కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలనూ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఆర్ఐ ఏర్పాటు చేస్తామన్నారు. మార్చురీలను ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీని ఆధునికీకరణ చేస్తామని తెలిపారు. మంత్రులతో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, టీస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీఎంహెచ్‌వో మాలతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్ సర్వేపై ప్రశంసలు
దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ప్రశంసించారు. ఈ సర్వేను అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించింది. తెలంగాణ తరపున ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ సన్నద్ధత, జ్వర సర్వే తీరు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. 60 ఏండ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని, రెండు డోసుల గడువు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈసీఆర్పీ - 2 పెండింగ్ నిధులు రూ. 248 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫీవర్ సర్వేను 'మంచి వ్యూహం'గా కేంద్రమంత్రి అభివర్ణించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు రూపకల్పన చేస్తామని వెల్లడించారు. రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని వివరించారు. కోవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలనీ, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జ్ కమిషనర్ రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓఎస్డీ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.