Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ బాధితులందరికీ చెల్లించాలి
- మార్చిలో చలో హైదరాబాద్
- రౌండ్‌టేబుల్‌లో వక్తల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేసి, తక్షణమే ఆ డబ్బులను బాధితుందరికీ చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తద్వారా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకునీ, బాధితులకు డబ్బులను చెల్లిస్తున్నదని వివరించారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం సైతం బాధితులను ఆదుకోవాలని సూచించారు. వచ్చేనెల మొదటివారం నుంచి నెలాఖరు వరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి వినతిపత్రాలు అందించాలనీ, జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే మార్చి మొదటి వారంలో 'చలో హైదరాబాద్' నిర్వహిస్తామని హెచ్చరించారు. 'తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి, రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలి'అనే అంశంపై తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యమ్రంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సమస్యను పరిష్కరించకపోతే అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల ఓట్లు తమకు పడవనే భావన అధికార పార్టీకి రావాలని చెప్పారు. అప్పుడే వారికి న్యాయం జరుగుతుందన్నారు. కేవలం వినతిపత్రాల ద్వారా సమస్యలు పరిష్కారం కాబోవని అన్నారు. బాధిత కుటుంబాలన్నీ వీధుల్లోకి రావాలని సూచించారు. ఏజెంట్ల ద్వారా మోసపోయామనే భావన నుంచి డిపాజిట్ దారులు బయటకు రావాలనీ, అందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.
వామపక్షాల విద్యుత్ పోరాట ఫలితంగా పదేండ్ల వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీలను పెంచలేకపోయాయని గుర్తు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యను పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కొన్ని చిట్ ఫండ్ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి మోసాల పట్ల కఠినంగా వ్యవహారించేలా నూతన సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై గవర్నర్, సీఎం, సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని, ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాలని సూచించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడబోదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మోసాలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం, ఈడీ, సీబీఐ, పోలీసు వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా బాధితులు ఐక్యంగా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలని సూచించారు. అధ్యక్షత వహించిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ఎన్ బాలమల్లేష్ మాట్లాడుతూ వచ్చేనెల ఒకటి నుంచి ఏడు వరకు ప్రతి మండలంలో అగ్రిగోల్డ్ బాధితుల కమిటీలను ఏర్పాటు చేస్తామనీ, ఎనిమిదో తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లాV్‌ా ఖాద్రి, తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి గోగుల వెంకటేశ్వర్, ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కోశాధికారి మద్దినేని రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లబోలు సునీత, దమ్మాలపాటి రామనర్సయ్య, ఆనంద్, కట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.