Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్లు, స్టాంఫుల శాఖకు భారీ ఆదాయం
- నెలవారీ ఆల్‌టైం రికార్డును బద్దలు కొట్టేదిశగా పరుగులు
- ఇప్పటికే రూ.1034 కోట్లు వసూలు
- నెలాఖరుకు మరో రూ.400 కోట్లకుపైగా వచ్చే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజిస్ట్రేషన్లు, స్టాంఫుల శాఖకు శుక్రవారం ఒక్కరోజే రూ.133కోట్ల ఆదాయం వచ్చింది. రాత్రి వరకూ రిజిస్ట్రే షన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నెలవారీ ఆల్‌టైం రికార్డును బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతున్నది. జనవరిలో ఇప్పటికే రూ.1034.349 కోట్ల ఆదాయం సర్కారు ఖజానాకు చేరింది. ఈ ధోరణి ఇలాగే కొన సాగితే నెలాఖరు వరకు మరో రూ.400కోట్లపైగా రావొచ్చు. మొత్తంగా రూ.1400 కోట్లకుపైగా చేరే అవ కాశముంది. రాష్ట్ర సర్కారు భూముల విలువను ఫిబ్రవరి మొదటి వారంలో 50 శాతం మేరకు పెంచబోతున్నదనే విస్తృత ప్రచారంతో సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు అమ్మకం, కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దఎత్తున స్లాట్ల ను ఒకేసారి బుక్ చేసుకోవడంతో తహసీల్దార్ కార్యాలయాలో శుక్రవారం రాత్రి వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటివరకూ నెలవారీగా చూస్తే డిసెంబర్లో వచ్చిన రూ.1052 కోట్లే అత్యధికం.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువను మరోసారి పెంచేందుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. పెంపు నిర్ణయం రాష్ట్ర సర్కారు నుంచి వెలువడకముందే భూములు, ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. భూములు, ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి ఒకటి, రెండు నెలల వాయిదాతో అగ్రిమెంట్ రాసుకున్నోళ్లు కూడా ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకునే పనిలో పడ్డారు. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో కిటకిటలాడుతున్నాయి. జనవరి 31లోగా రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి ఈ-చలానాలు కూడా కట్టేస్తున్నారు. ప్లాటు విస్తీర్ణం, స్థానిక మార్కెట్ వాల్యూను బట్టి కనీసం లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలు భారం తగ్గుతుందనే ఆశతో ముందస్తు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల తాకిడితోపాటు సర్కారు ఖజానా పెరుగుతున్నది. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా సోమవారం రూ.65 కోట్లు రాగా గురువారం వచ్చేసరికి అది రెట్టింపై రూ.133 కోట్లకు చేరుకున్నది. గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8,200కిపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. సాధారణంగా అయితే రోజుకు రూ.30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యనే వచ్చేది. సెలవుదినమైన గణతంత్ర దినోత్సవ వేడుకల రోజూ ఆన్లైన్ ద్వారా రూ.10 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. వచ్చే మూడు రోజులూ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముంది.
రూ.1400 కోట్లకుపైగా ఆదాయం చేకూరే అవకాశం!
ఇదేతరహాలో నెలాఖరు వరకూ రిజిస్ట్రేషన్లు జరిగితే రాష్ట్ర సర్కారు ఖజానాకు రూ.1400 కోట్లకుపైగా చేకూరే అవకాశముంది. అలాగైతే అది ఆల్‌టైమ్ రికార్డు అవుతుంది. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు ఇప్పటిదాకా గత డిసెంబర్ నెలలో వచ్చిన రూ.1052 కోట్లే అత్యధికం. అదీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 50 శాతం ఈ ఏడాది జూలై 22వ తేదీన పెంచిన తర్వాతే జరిగింది.
అంతకుముందు రిజిస్ట్రేషన్ల శాఖకు నెలకు రూ.500 కోట్లకు మించి రాకపోయేది. పెంచిన తర్వాత అదికాస్తా రెట్టింపైంది. మళ్లీ మార్కెట్ విలువ పెంచితే ఆ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. మళ్లీ చార్జీలు, విలువ పెంపుతో ఆ ఆదాయం ప్రతినెలా రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన పది నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,864.941 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఒక్కనెలలోనే ఇప్పటివరకూ రూ.1034.349 కోట్లు సమకూరింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నుంచి మార్చికల్లా రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని అంచనా కట్టింది. ప్రస్తుత సరళిని పరిశీలిస్తే బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి సర్కారు తన లక్ష్యాన్ని చేరే అవకాశమున్నది. అయితే, ఇక్కడా అంతిమంగా నష్టపోయేది సామాన్యులే. వంద గజాలు కొనుక్కుని సొంతిళ్లు కట్టుకోవాలకునే సామాన్యులపైనా ప్రాంతాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇలా సర్కారు పెంచుతూ పోతే మధ్యతరగతివారికి సొంతిటి కల కలగానే మిగిలే ప్రమాదంఉంది. పెంపు ప్రతిపాదనను రియల్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు.