Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ పోరాట స్ఫూర్తితో ఇన్సూరెన్స్ ఉద్యోగులు పోరాడాలి
- వేతనసవరణ, పాతపెన్షన్ విధానం, తదితరాల కోసం ఉద్యమం : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
- జాయింట్ ఫోరం ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశప్రజలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అలర్ట్ కాకపోతే కేంద్రంలోని మోడీ సర్కారు అన్నింటినీ అమ్మేస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో తమ సంస్థల ను రక్షించుకునేందు కోసం ఇన్సూరెన్స్ ఉద్యోగు లంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెను దేశవ్యాప్తంగా చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 'వేతన సవరణ చేయాలి...ఎన్పీఎస్ రద్దు చేయాలి-పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి 30శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి..ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏఐఐఈఏ హైదరాబాద్ రీజియన్ ప్రధాన కార్యదర్శి వై.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమ్మెలో జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 54 నెలలుగా వేతన సవరణ చేయకపోవడం దారుణమని విమర్శించారు. జీఐసీని నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. ఎన్‌ఎమ్‌పీ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అంబానీ, ఆదానీ, టాటా, ఇతర కార్పొరేట్లకు కట్టబెట్టచూస్తున్నదనీ, తద్వారా ఆరులక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకునే పనిలో ఉందని విమర్శించారు. నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 30 ఏండ్లుగా ఐడీపీఎల్, బీహెచ్ఎల్, ఈసీఐఎల్‌ను నిర్వీర్యం చేస్తున్న తీరును వివరించారు. ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను కారుచౌకగా టాటాకు కట్టబెట్టిందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రజలకిచ్చిన హామీని మోడీ సర్కారు బుట్టదాఖలు చేసిం దన్నారు. బీహార్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావించారు.
ఇన్సూరెన్స్‌రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టే పనికి మోడీ సర్కారు పూనుకున్నాదన్నారు. ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి వాజ్‌పేయి, ఓఐసీఓఏ కార్యదర్శి కల్పన, ఎన్ఐఏఓఏ ప్రధాన కార్యదర్శి అనంతకృష్ణ, ఎన్ఐసీఓఏ అధ్యక్షులు టి రవీందర్, బీవీకేఎస్ అధ్యక్షులు ఎన్వీఎస్ఎన్ మూర్తి, జీఐ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎల్ఐసీ పెన్షనర్స్ అసోసియేషన్ నేత భాగ్యలక్ష్మి, శశికాంత్, తదితరులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయడం ద్వారానే వేతన సవరణ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణను సెటిల్ చేయాలని కోరారు, లేదంటే జాయింట్ ఫోరమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఐక్యపోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.