Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి పండిస్తే గ్రామాలకు సబ్సిడీలు బంద్
- వెయ్యిమందితో కౌంటర్ ఇంటలిజెన్స్
- పోలీస్, ఎక్సైజ్‌శాఖల సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్తంగా విస్తతమవుతున్న గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 'రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖల సమీక్ష జరిగింది. మంత్రులు మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్ర కుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, సాయన్న, రేఖా నాయక్, అబ్రహం, హన్మంతు షిండేతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సీఎంవో అధికారులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి, హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన డీజీపీ మహేందర్ రెడ్డికి చెప్పారు. గ్రే హౌండ్స్ తరహాలోనే గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్‌ను నియంత్రించే విభాగం శక్తివంతంగా పనిచేయాలన్నారు. ఇలాంటి కేసుల్లో ఎవర్నీ ఉపేక్షించొద్దనీ, ఏ పార్టీ వారైనా నేరస్థులను కాపాడేందుకు సిఫారసులు చేస్తే నిర్ద్వందంగా తిరస్కరించాలని చెప్పారు.
పోలీస్ అధికారులు నేరాలను నిరూపించేందుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సినిమా, సోషల్ మీడియా, ఆన్లైన్, తదితర సాంస్కతిక వేదికల ద్వారా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ డ్రగ్స్‌ను నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టయిజ్మెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, అలాంటి వారిని గుర్తించి వారి దేశాలకు తిప్పి పంపేయాలని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నార్కొటిక్ డ్రగ్స్ వినియోగం, వాటి మూలాలను గుర్తించి కఠినంగా నియంత్రించాలని ఆదేశించారు.
హుక్కా సెంటర్లపై చర్యలు
రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్‌శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది కానీ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఈసందర్భంగా సీఎం స్పష్టం చేశారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగం జరిగితే తక్షణం లైసెన్స్‌లు రద్దు చేయాలని చెప్పారు. నార్కోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దష్టికి వచ్చిందనీ, డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలన్నారు. పేకాట తదితర వ్యవస్థీకత నేరాలను సమూలంగా రూపుమాపాలన్నారు. డ్రిగ్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్‌తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద కూడా వున్నదన్నారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయమన్నారు. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకోని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రత్యేక రూములు, వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 'తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్' ను తిరిగి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ, అందుకు ప్రణాళికలు సిద్దం చేయాలనిఆదేశించారు.