Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి
- మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
- మృతదేహాలతో జాతీయ రహదారిపై ఆందోళన
నవతెలంగాణ-చండ్రుగొండ
వ్యవసాయ కూలీలతో వెళుతున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా అతివేగంగా వస్తున్న బొగ్గు టిప్పర్ ఢ కొనడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాత నగర్ మండల కేంద్రంలోనే దళిత కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు వరినారు తీసేందుకు ట్రాలీలో ఉదయం బయలు దేరారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో గల జాతీయ రహదారిపై ట్రాలీ ఎక్కగానే ఎదురుగా సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపునకు వస్తున్న బొగ్గు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కత్తి స్వాతి (26), వేకిరళ సుజాత(46), అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారిని స్థానికులు 108, ఇతర వాహనాల ద్వారా కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్రం లక్ష్మి (52), కత్తి సాయమ్మ (40) మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మంది కూలీల్లో కత్తి సుగుణ, వెంకటరమణ, నాగులుతో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో టిప్పర్ వేగానికి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరగగా షేక్ ఖాజాబీ, తేజావత్ కోదులకు చెందిన ఇండ్లు ధ్వంసమయ్యాయి.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు మృతదేహాలతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు అఖిల పక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ఉద్యోగం, రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, జూలూరుపాడు సిఐ నాగరాజు, కొత్తగూడెం డివిజన్లోని సీఐలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పుటికీ తమకి న్యాయం జరిగేంత వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చున్నారు.