Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహత్మాగాంధీ వర్థంతిని మతసామరస్యం, లౌకికవాద స్ఫూర్తితో జరపాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, ఎండీ అబ్బాస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జనవరి 30, 1948 లో నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని మత విద్వేషంతో దారుణంగా హత్య చేశాడని గుర్తుచేశారు. గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమించి నడిపి స్వాతంత్య్ర సమరంలో కీలక భూమిక పోషించారని తెలిపారు. దేశంలో ప్రజలంతా మతవిశ్వాసాలకు అతీతంగా కలిసి మెలిసి జీవించాలంటూ కలలు కన్నారని పేర్కొన్నారు. మత రాజ్యం కాకుండా సర్వమతాల సమాహారంగా ఉండే లౌకిక దేశంగా భారత్ ఉండాలని గాంధీ ఆకాంక్షించారని తెలిపారు. మతోన్మాద సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన గాడ్సే దేశానికి గాంధీజీ చేసిన సేవలను విస్మరించి ఆయనను దారుణంగా హతమార్చాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యకు మత రాజకీయాలే కారణమని తెలిపారు. ప్రస్తుతం దేశంలో అవి ఉచ్చస్థితికి చేరాయని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ద పదవులలో ఉన్నవారే రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతారాహిత్యంగా మత విద్వేషం, అసహనంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.