Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీఎఫ్ డాబ్రియేల్ వేధింపులే కారణం
- అటవీశాఖ సూపరింటెండెంట్ జయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నాకు ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉంది. అయినా వీఆర్ఎస్ తీసుకుంటున్న. దీనికి ఒకే ఒక కారణం పీసీసీఎఫ్ డాబ్రియేల్నే' అని అటవీశాఖ సూపరింటెండెంట్ జయలక్ష్మి చెప్పారు. శనివారం హైదరాబాద్లోని సోమాజిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను అటవీశాఖలో 1988లో చేరానని చెప్పారు. 2015 నుంచి తనపై పీసీసీఎఫ్ డాబ్రియేల్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను నిజామాబాద్లో పనిచేటప్పుడు ఇన్చార్జి మేనేజర్ పోస్టు కోసం పోటీ నెలకొందనీ, ఆ సమయంలో ఆ పోస్టు నాకు ఇచ్చారని తెలిపారు. అది అటవీశాఖలో ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. ఆ సమయంలో ఇన్చార్జి పోస్టు కోసం రమణ కూడా పోటీపడ్డారనీ, ఆయనపై అత్యాచారం కేసు ఉండటంతో ఉద్యోగులంతా తనకు మద్దతు తెలిపారని వివరించారు. అప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయన్నారు. మామిడిపల్లి లో ఓ క్వారీకి సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చాననీ, ఈ విషయంలో రమణ, డాబ్రియేల్ తనపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను ఇన్చార్జిగా ఉన్న సమయంలో సీనియారిటీ సంబంధించిన విషయంలో నలుగురు ఉద్యోగుల వివరాలు నమోదు కాలేదన్నారు. ఇదే అంశంపై విచారణ కమిటీ వేశారనీ, విజిలెన్స్ఆఫీసర్గా పీసీసీఎఫ్ డాబ్రియేల్ వచ్చి తనను దుర్భాషలాడారని ఆరోపించారు. విచారణాధికారిగా మహిళను నియమించాలని మహిళాకమిషన్ను కోరాననీ, ఆయన తీరుకు వ్యతిరేకంగా హైకోర్టునూ ఆశ్రయించానని చెప్పారు. దీంతో తనను హైదరాబాద్ నుంచి బాన్సువాడకు బదిలీ చేశారనీ, అక్కడకు వెళ్లేందుకు ఇష్టంలేక మెడికల్ లీవ్లోకి పోయానని తెలిపారు. ఆ తర్వాత కాలక్రమంలో తనకు భువనగిరిలో పోస్టింగ్ ఇచ్చారని చెప్పారు. అక్కడికెళ్లాక కూడా డాబ్రియేల్ వేధింపులు ఆగలేదనీ, అందుకే వీఆర్ఎస్ తీసుకున్నానని ప్రకటించారు. డాబ్రియేల్ పై విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.