Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ భాషలోనే ఎంపిక పరీక్షలు నిర్వహించాలి
- రైల్వే మంత్రికి బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే రిక్రూట్ మెంట్ విధానంలో సమూల ప్రక్షాళన చేసి జోనల్ స్థాయిలోనే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు శనివారంనాడాయన లేఖ రాశారు. క్లర్క్, అంతకు కింది స్థాయి పోస్టులకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం విడ్డూరమన్నారు. జాతీయ స్థాయి పరీక్షల వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పెత్తనమే సాగుతోందని, ప్రాంతీయ భాషల రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. రైల్వే పరీక్షల కోసం ఉత్తరాదిలో కోచింగ్ సెంటర్లు మాఫియా తరహాలో పనిచేస్తున్నాయనీ, వాటి మాయాజాలం వల్ల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. 35 వేల రైల్వే పోస్టుల కోసం ఒక కోటి 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారని తెలిపారు. రైల్వే రిక్రూట్ మెంట్ వ్యవహారంపై బీహార్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకోవడం, చివరికి బీహార్ బంద్ వరకు వెళ్లడం వంటి ఘటనలు దురదృష్టకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాంతీయ భాష తెలుగులో రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించాలనీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాషలోనే రైల్వే రిక్రూట్మెంట్ జరగాలని చెప్పారు.