Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నుంచి పదో తరగతిలో చేరేందుకు అవకాశం
- ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- మార్చి 10 వరకు సమర్పణకు గడువు
- ఏప్రిల్ 17న ఆరు, 16న ఏడు నుంచి పది తరగతులకు రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి శనివారం షెడ్యూల్ జారీ చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చేరేందుకు అవకాశమున్నదని తెలిపారు. వచ్చేనెల ఎనిమిది నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వాటి సమర్పణకు తుది గడువును మార్చి 10గా నిర్ణయించామని వివరించారు. ఏప్రిల్ ఎనిమిది నుంచి ఆరో తరగతి విద్యార్థులు, తొమ్మిది నుంచి ఏడు నుంచి పదో తరగతి వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 17న ఆరో తరగతి, 16న ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం రాతపరీక్ష నిర్వహిస్తామని వివరించారు. వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆయా మండలాల్లోనే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 18 నుంచి మే నాలుగో తేదీ వరకు పరీక్ష అనంతర పనులుంటాయని వివరించారు. మే ఐదో తేదీన ఫలితాలు విడుదల చేస్తామనీ, సీజీజీకి ఆ వివరాలు అందజేస్తామని ప్రకటించారు. జూన్ 20న ప్రవేశాల జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు. అదేనెల 24న మోడల్ స్కూళ్లలో ఎంపికైన విద్యార్థుల వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 24 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. జూన్ ఒకటి నుంచి తరగ తులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలు రూ.75, ఇతరులు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలు, దరఖాస్తు ఫారాల డౌన్లోడ్ కోసం వచ్చేనెల ఎనిమిది నుంచి http://telanganams.cgg.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.