Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే రూ.99 కోట్ల ఆదాయం
- భూముల విలువ పెంపుపై రాని స్పష్టత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర సర్కారు పెంచబోతుందనే ప్రచారంతో శనివారమూ రిజిస్ట్రేషన్లు భారీ ఎత్తున జరిగాయి. సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు భూముల అమ్మకం, కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. శనివారం రాత్రి వరకూ రిజిస్ట్రేషన్లతో పాటు, ఈ-స్టాంపు చలానాల చెల్లింపుల ద్వారా 99 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేకూరింది. మొత్తంగా దాదాపు పదివేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాత్రివరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ధరణి పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కొనసాగుతూనే ఉన్నది. దీంతో భూముల అమ్మకం, కొనుగోలు దారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బుక్ అయిన స్లాట్లల్లో సగం మేరకే రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు సమాచారం. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భూముల విలువలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. సవరించిన మార్కెట్ విలువను గతేడాది జూలై 22న అమల్లోకి రాగా జూలై 20వ తేదీన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. 20, 21 తేదీల్లో 'కార్డు' సాఫ్ట్ వేర్ లో కొత్త విలువల అప్ డేషన్ జరిగింది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర సర్కారు నుంచి అలాంటి ఆదేశాలేమీ వెలువడలేదు. మిగిలిపోయిన రిజిస్ట్రేషన్లను ఆదివారం చేస్తారా? లేదా? అనేదానిపైనా క్లారిటీ లేదు. సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అనే స్పష్టతా లేదు. దీంతో అంతా గందరగోళం నెలకొంది. రిజిస్ట్రేషన్లు, స్టాంఫుల శాఖకు శనివారం ఒక్కరోజే రూ.99 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో కలిపి డిసెంబర్ నెల ఆదాయం రూ.1135 కోట్లకు చేరుకున్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.7,966 కోట్ల ఆదాయం వచ్చి చేరినట్టయింది.