Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం వెంటనే విధుల్లో తీసుకోవాలి
- ఆప్ జాతీయ నేత సోమనాథ్ భారతి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న 13,500 మంది విద్యావాలంటీర్లను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆప్ జాతీయ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి విమర్శించారు. రెండేండ్లుగా వారికి ఉపాధి లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. శనివారం విద్యావాలంటీర్ల వర్చువల్ సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఒక్కో విద్యావాలంటీర్పై ఆధారపడి ఓ కుటుంబం ఉందని సోమనాథ్ భారతి చెప్పారు. వారిని తొలగించడం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావాల్సిన అర్హతలున్నా వారికి రూ.12 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తున్నదని విమర్శించారు.ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనం రూ.17 వేలు చెల్లిస్తున్నదని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. వారిని విధుల్లోకి తీసుకోవాలనీ, 2020, జనవరి నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యావాలంటీర్ల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆప్ తెలంగాణ కో ఇంచార్జీ ఇందిరాశోభన్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఈ ప్రభుత్వం బలి తీసుకుంటున్నదని విమర్శించారు. విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. విద్యావాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలంటూ తీర్మానాలు చేశారు.