Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్డింగ్ మీది నుంచి పడి.. బాలుడు మృతి
నవతెలంగాణ-ముదిగొండ
డాబా పై గాలిపటం ఎగురవేస్తూ ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముదిగొండకు చెందిన కాంచని పెద్ద లింగయ్య(లేటు) -లింగమ్మ దంపతుల ఏకైక కుమారుడు గోపి(8) స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదుతున్నాడు. బాలుడి తండ్రి పెద్ద లింగయ్య ఐదు సంవత్సరాల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి లింగమ్మ కూలి పనులు చేస్తూ కుమారుడు గోపిని చదివించుకుంటోంది. గోపికి ఇటీవల చెయ్యి విరగడంతో విశ్రాంతి తీసుకున్నాడు. గురువారం చేయి కట్టు విప్పారు. మరుసటి రోజు శుక్రవారమే తన బాబాయి ఉపేందర్ ఇంటి డాబాపై గాలిపటం ఎగురవేస్తూ కిందపడ్డాడు. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం ఉదయం విజయవాడ తీసుకుపోతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో అప్పుడు భర్త... ఇప్పుడు కొడుకును పోగొట్టుకుని తల్లి లింగమ్మ ఏకాకిలా మిగిలింది. కొడుకు మృతదేహం వద్ద గుండెలవిసేలా విలపిస్తోంది.
నివాళులర్పించిన సీపీఐ(ఎం) నేతలు
గోపి మృతదేహాన్ని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వేల్పుల భద్రయ్య, నాయకులు మందరపు వెంకన్న, కందుల భాస్కర్ రావు, ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మెట్టెల సతీష్, కాంచని చిన్న లింగయ్య ఉన్నారు.