Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు
నవతెలంగాణ-చిట్యాల
ప్రభుత్వం తీసుకొచ్చిన ''ధరణి'' వల్ల భూస్వాములకు, పెత్తందారీలకు ప్రయోజనం తప్ప పేదలకు ఉపయోగం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణిలో భూమి కబ్జా కాలం తీసేయడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం సబ్‌కమిటీ వేసినప్పటికీ ప్రతిపాదనలు కానీ, నివేదిక కానీ ఇప్పటివరకు తీసుకోకపోవడంతో పేద రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. భూముల పట్టా ఒకరి పేరున, కబ్జాలో మరొకరి పేరు ఉండటంతో గ్రామాల్లో తగాదాలు జరుగుతున్నాయన్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, పోలీసుస్టేషన్ల చుట్టూ రైతులు తిరుగుతున్నారని చెప్పారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం, పట్టాదారు పాసుపుస్తకాల తప్పులు, ఫౌతి అమలు వంటి పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 7న చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను, నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, జిట్ట సరోజ, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దులు తదితరులు పాల్గొన్నారు.