Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ కి మంత్రి హరీశ్‌రావు సవాల్
- దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలివచ్చి పోరాటం చేస్తరు
నవతెలంగాణ-కొత్తగూడెం
''హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలివచ్చి పోరాటంలో కలుస్తారు'' అని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంత్రి పర్యటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో 100 పడకల మాతా, శిశుసంరక్షణ ఆస్పత్రిని ప్రారంభించారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజీ ఆవరణంలో నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారని, దొంగే దొంగ అంటున్నారని, అసలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు...?ఇవ్వనిది ఎవరు..?ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా..? దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా..? ప్రజలకు తెలుసన్నారు. బండి సంజయ్ అండ్ బ్యాచ్ దమ్ముంటే సమాధానం చెప్పాలి.. మీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో, నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుందో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమాలలో టీఎస్ఎంఐసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండా శ్రీనివాస్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, కుటుంబ ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ అనుదీప్, డీయంఈ రమేష్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్, జడ్పీ వైస్‌చైర్మెన్ చంద్రశేఖర్‌రావు, డాక్టర్ ముక్కంటేశ్వరావు, పర్యవేక్షకులు డాక్టర్ సరళ పాల్గొన్నారు.