Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి, ఎర్రబెల్లి
- మేడారం ట్రస్ట్ బోర్డు ప్రకటన
- ఆదివాసీలకు అవకాశం కల్పించలేదంటూ ఆదివాసీ, గిరిజన సంఘాల ఆందోళన
- ప్రమాణస్వీకారం వాయిదా
నవతెలంగాణ-ములుగు
కుంభమేళా తరహాలో సాగనున్న మేడారం మహాజాతర సందర్భంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జాతర ప్రదేశంలో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. శనివారం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. వారికి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, సీఎస్, డీజీపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించి అక్కడి నుంచి జంపన్న వాగు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ద్వారా ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ మేడారానికి వచ్చే ప్రజలందరికీ ప్రశాంత వాతావరణంలో దర్శనం కావాలన్న సంకల్పంతో ఏర్పాట్లు చేయడానికి భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. ఫిబ్రవరి 18న సీఎం కేసీఆర్ మేడారానికి వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మేడారం జాతరకు రూ.332 కోట్లతో సౌకర్యాలు కల్పించామని తెలిపారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. జాతర పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆదివాసీ, గిరిజన సంఘాల ఆందోళన
మేడారం ట్రస్ట్ బోర్డ్‌ను మంత్రులు ప్రకటించాక.. ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బోర్డులో ఆదివాసేతరులకు స్థానం కల్పించారని, ఆదివాసీ, గిరిజనులకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించలేదు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్, పూసల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, తదితరులు పాల్గొన్నారు.